ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ORNAMENTS TO UR FOOT - TRADITIONAL INDIAN CULTURE


కాలి అందియలు…..!

కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే…. అంటూ పాత తెలుగు పాటలో కాలిఅందెల గొప్పతనాన్ని మరపురాని రీతిలో వర్ణించారు. గజ్జె ఘల్లుమంటుంటే… గుండె జల్లుమంటుంది అంటూ కాలి గజ్జెలు చేసే చిరు సవ్వడి గురించి మరో తెలుగు సినీ కవి పలవరించడం కూడా మనకు తెలుసు.
అందియలు.. పట్టీలు.. గజ్జెలు.. మువ్వలు ఇలా ఏ పేరుతో పిలిస్తేనేం…. భారతీయ కుటుంబాల్లో కాలి అందెలకు లేక పట్టీలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మహిళలందరూ ఇష్టపడే ఆభరణాల్లో కాలి అందెలకు కూడా చోటుంది. మన తెలుగు లోగిళ్లలో ఆడపిల్లలు ఉన్నవిషయం కూడా ఈ కాలి పట్టీల వల్లే తెలిసేదంటే ఆశ్చర్యపడనవసరం లేదు.
కాలి మువ్వల గలగలలు వినిపించని, అందెల రవళులు సోకని కుటుంబాలను ఒకప్పుడు మనం ఊహించి ఉండం. పిల్లలూ, పెద్దలూ పోటీ పడి ఒకప్పుడు అందెలు పెట్టుకునేవారు. అయితే మారిన అభిరుచుల మేరకు అందెలు పెట్టుకోవడం బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలెవరూ పాఠశాలకు పట్టీలు పెట్టుకుని పోవడం లేదు.
సవ్వడి చేయని అందెలు..
ఇంతవరకు తెలుగు లోగిళ్లను మురిపించిన అందాల కాలి మువ్వలు శబ్ద సౌందర్యానికి దూరమయ్యే రోజులు వచ్చేశాయి. ఎవరు ఔనన్నా, కాదన్నా ఇప్పుడు ఫ్యాషన్లదే రాజ్యం. కాబట్టే గజ్జెల సవ్వడిలోని మంత్రనాదాలకు ఇప్పుడు కాలం చెల్లుతూందేమో.. మువ్వల సవ్వడి లేని కాలమిది…
కొన్ని ప్రయివేటు పాఠశాలల్లో అయితే కాలి పట్టీలను పెట్టుకునే వీలులేకుండా నిషేధించారు. పైగా అది చేసే శబ్దానికో లేక ఫ్యాషన్ కాదనే ఫీలింగుతోటో చాలామంది ఆడపిల్లలు పాఠశాల రోజుల్లో వీటిని పెట్టుకోవటం లేదు. అయితే కాలేజీకి వెళ్లేటప్పుడు యువతులు పెట్టుకోవడానికి వీలుగా ఆకర్షణీయమైన పట్టీలు వచ్చేశాయి. అవి ఏవంటే సవ్వడి చేయని పట్టీలు.
ఘల్లుఘల్లుమనని మువ్వలు..
ఇదివరకు పట్టీలు వెండితో తయారు చేసి గజ్జెలతో నిండుగా ఉండేవి. కాళ్లకు నిండుగా పట్టే ఈ చిరుమువ్వలు నిశ్శబ్ద వాతావరణంలో మంత్రనాదంలా మోగుతూ అందరి దృష్టినీ ఆకర్షించేవి. అయితే ఇప్పుడు కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు అలాంటి పూర్ణ పట్టీలను ఇష్టపడటంలేదు. పాత కాలపు మువ్వలు ఆధునిక వస్త్రధారణకు అనుకూలంగా లేవని భావించేవారి కోసం కొత్త పట్టీలు వచ్చాయి. ఇవి శబ్దం చేసేవి కాకపోవడమే విశేషం.
ఆధునిక విద్యార్థినులు, యువతుల కోసం శబ్దం చేయని పట్టీలు ఇప్పడు మార్కెట్లోకి వచ్చాయి. కాలికి రెండు వరుసలు పెట్టుకుని దాని కొసను కాలివేలికి తగిలించుకుని ఉండే రకం పట్టీలు వచ్చాయి. వీటిని లంగా, వోణీలమీద వేసుకోవడానికి తయారు చేయలేదు మరి. తాజా ఫ్యాషన్ దుస్తులపై హైహీల్స్ వేసుకున్నప్పుడు పెట్టుకోడానికి శబ్దంలేని పట్టీలు వచ్చేశాయి.
ఇలాంటి వాటిని డ్రస్‌కు మ్యాచింగ్‌గా కూడా పెట్టుకోవచ్చు. రెండు వరుసల పూసల పట్టీలు, నీలంరాళ్లు పొదిగిన పట్టీలు, గొలుసు మోడల్‌లో ఉన్న పట్టీలు, మెటల్‌తో చేసిన పట్టీలు ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా ఇవన్నీ శబ్దం లేదా సవ్వడి చేయని నిశ్శబ్ద పట్టీలు కావడం విశేషం.
మువ్వల సౌందర్యం అంతా గజ్జె ఘల్లుమనడంలో ఉందనుకుంటే ఇప్పటి తరం అందుకు అంగీకరించడం లేదు. సింపుల్‌గా ఉండటమంటే నిశ్శబ్దంగా ఉండటం అని కూడా అర్థం మారిపోయిన రోజుల్లో కాలి అందెలు కూడా ‘సాఫ్ట్ సంస్కృతి.ని అలవర్చుకున్నాయి. ఎవరయినా కాలం మార్పును అంగీకరించాల్సిందే కదా.. అందుకే గజ్జె ఘల్లుమనని నూతన ధోరణులను కూడా ఆహ్వానిద్దాం మరి….