ఊళ్లో ఓ పేదవాడు పెంచుకునే గాడిద ఒకటి, బాగా ఒక్క చిక్కి పోయి ఉండేది. దగ్గర అడవిలో పచ్చగడ్డి కనిపించే సరికి, ఆశకొద్దీ అది అటు వైపుగా వచ్చి మేయటం మొదలు పెట్టింది. ఆ అడవిలోనే భయంకరమైన సింహం ఒకటి ఉండేది. ఆ మధ్యనే అది ఒక ఏనుగుతో పోరాడి చాలా గాయాలు తగిలించుకొని ఉన్నది - కొద్ది కాలంగా వేటాడటం, అదీ వీలవ్వటం లేదు దానికి, అందుకని , అది తనకు తెలిసిన నక్కనొక దాన్ని పిలిచి, "ఓరే, నాకు యీ గాయాల కారణంగా అడవిలోకి వెళ్లి వేటాడటం కుదరట్లేదు. బాగా ఆకలిగా ఉంది.
అందుకని ఒకపని చెయ్యి - నీ తెలివితేటలను ఉపయోగించి, అడవిలో కనబడ్డ ఏ దున్నపోతునో, గాడిదనో, గుర్రాన్నో నా గుహ దగ్గరికి తీసుకురా. నేను ఒక్క ఉదుటన దాని మీదికి దూకి చంపేస్తాను. అట్లా నీకూ ఎంతో కొంత తినటానికి దొరుకుతుంది కూడాను.
చూడు, మరి!" అన్నది.
నక్క అడవిలో కొద్దిసేపు తిరిగిందో, లేదో, దానికి మన గాడిద కనబడింది. నక్క దాని దగ్గరికి వెళ్లి మర్యాదగా పలకరించి, "గాడిద బావా! ఏంటి, నీ కథ? ఇంత చిక్కిపోయావెందుకు? మేత సరిగ్గా దొరకటం లేదా? అడవి అంతా మంచి పచ్చగడ్డి, కొల్లగా ఉంది గద?" అన్నది.
"అంతా దైవేచ్ఛ! దేవుడి ఇష్టం ప్రకారమే యీ జగత్తులో ఏదైనా జరుగుతుంది, ప్రాణాలు కులాసాగా తిరగాలన్నా, రోగాలతో బాధపడాలన్నా - దేనికైనా ఆ భగవంతుడి సంకల్పం అవసరం. ఆయన శక్తి ముందు మనం ఏపాటి?" అన్నది గాడిద.
"అయ్యో! బావా! నువ్వు ఎక్కడో తప్పుగా అర్థం చేసుకున్నావు. 'తృప్తి' అంటేనూ, 'దైవేచ్ఛ' అంటేనూ ఏమిటో నీకు సరిగా అర్థం అయినట్లు లేదు. 'నీ జీవితానికి అధారమైన ఆహారాన్ని మిగిలిన అన్ని ప్రాణులలాగానే నువ్వూ వెతుక్కోవాలి' - ఇదే దైవేచ్ఛ అంటే" అన్నది నక్క.
గాడిద అన్నది - "నక్క బావా! తృప్తిగా ఉండటం వల్ల చచ్చిపోయిన వాడెవరూ నాకు ఇంత వరకూ కనబడలేదు. అట్లాగే , ఆశగా కోరినంత మాత్రాన రాజైపోయిన వాణ్ణీ నేనెన్నడూ చూడలేదు.
"పో, బావా! నీ వేదాంతం అంతా తప్పు" అన్నది నక్క.
రెండూ ఈ వరసలో కొంత సేపు వాదులాడుకున్నాక, నక్క తన చివరి అస్త్రాన్ని 'ఆశ' అనేదాన్ని - ప్రయోగించింది". చూడు బావా! ఇవన్నీ వట్టి మాటలు, నాకు ఇవేమీ చెప్పకు, ఇక్కడికి దగ్గర్లోనే దుబ్బలు దుబ్బలుగా పచ్చగడ్డి పెరిగిన ప్రదేశం ఒకటి ఉన్నది. నీలాంటి జంతువులకు స్వర్గం అంటే అదే. నువ్వు అక్కడికి వస్తానంటే రా, దారి చూపిస్తాను, లేకపోతే నా దారిన నేను పోతాను," అన్నది.
నిరంతరం ఆకలితో అలమటించిపోతున్న గాడిద మొహం ఆ మాటలకు వికసించింది. తన వాదనలను కట్టి పెట్టి అది నక్క వెంబడి, అది చూపిస్తానన్న స్వర్గాన్ని అనుభూతి చెందటం కోసం బయలు దేరింది.
చాలా దూరం నుండే దాన్ని చూసింది సింహం. మరుక్షణం దానికి నోట్లోనీళ్లు ఊరటం మొదలు పెట్టాయి. గాడిద ఆత్రం కొద్దీ ఇంకా దూరంగా ఉండగానే అది దాని వైపుకు లంఘించి బోయింది. కానీ అది చాలా బలహీనంగా ఉందేమో, గాడిదను చేరకనే బొక్క బోర్లా పడి, ఇక లేవలేక గట్టిగా మూలిగింది! గాడిద కంగారుగా వెనక్కి తిరిగి పరుగో పరుగు!
నక్క సింహం దగ్గరికి వచ్చి నిలబడి - "ప్రభూ! తమరు ఇంకొంచెం ఓపిక పట్టి, మరి కాస్త తెలివివిని ప్రదర్శించి ఉంటే సరిపోయేది కదా, యీ గాడిద తమరి భోజనం అయి కూర్చొనేది!" అన్నది విచారంగా.
తొందర పాటు వల్ల చేతికందిన ఆహారాన్ని పోగొట్టుకున్న సింహం గట్టిగా నిట్టూర్చి - "నన్ను క్షమించు మిత్రమా! నువ్వున్నది నిజం. తొందర పాటు ఎంత చేటో చూడు, అయినా నీ ప్రయత్నం గొప్పది; నీ తెలివి అమోఘమైనది. విరమించుకోకు, మరొక్కసారి ఆ
గాడిదను ఏదో ఒక విధంగా ఇక్కడికి తీసుకురా; కాదనకు. యీ సారి నేను ఏం చేస్తానో చూడు" అన్నది.
"ప్రభూ! నేను ఇంకో సారి ప్రయత్నించి చూస్తాను, ఏదో ఒక మాయ చేసి, ఆ గాడిదను మళ్లీ మీ గుహ దగ్గరికి తెస్తాను. కానీ యీ సారి తమరు తొందరపడకండి-నిగ్రహంతో పనిని సాధించాలి" అని చెప్పి, తిరిగి గాడిదను వెతుక్కుంటూ బయలుదేరింది నక్క.
నక్కని చూసి గాడిద వణికి పోయింది- "బావా! ఏమిటిది? 'స్వర్గాన్ని చూపిస్తాను' అని తీసుకెళ్లి నన్ను నేరుగా సింహం నోట్లోకే తోశావే! నీకు నేనేం అపకారం చేశానని, ఇంత పని చేశావు?" నిలదీసింది అది, నక్కని.
నక్క ఆశ్చర్యాన్ని నటిస్తూ - "ఏంటి?! సింహమా?! అదెక్కడున్నది?! యీ అడవిలో ఇన్నేళ్లుగా ఉంటున్నాను - ఒక్కటంటే ఒక్క సింహమూ కనబడలేదే, నాకు?! నీకెక్కడ కనబడింది?!" అన్నది.

"ఊరికే కనబడటమా?! లేదు! అది నేరుగా నా మీదికే దూకితేను!" అన్నది గాడిద, ఆ ఆలోచనకే మళ్లీ చెమటలు పోస్తుండగా.
"ఊరుకో గాడిద బావా! నీకు భ్రమ రోగం ఏదో ఉన్నట్లుంది. లేకపోతే, నాకు కనబడని సింహం నీకు కనబడటమేమిటి, నీ ప్రక్కన నేనుండగానే అది నీ మీదికి దూకటం ఏంటి, మళ్లీ నిన్ను వది లెయ్యటం ఏంటి? నిజంగా సింహం నోటచిక్కి తప్పించుకోగలరా, ఎవరన్నా?! నీ భ్రమనిక కట్టిపెట్టు" అన్నది నక్క, గాడిద అనుభవాన్ని కొట్టిపారేస్తూ.
గాడిద ఆ మాటలకు ఒట్టి గాడిదే అయిపోయింది: తన అనుభవాన్ని తానే అనుమానించింది. "అవునా! నిజంగానే?! నేను భ్రమ పడ్డట్లున్నాను! ఎంత భయపడ్డానో చూడు, అనవసరంగా! అసలక్కడ సింహమే లేదు! నా వెర్రిభయం కూల! పద, వెళ్లి హాయిగా గడ్డి మేస్తాను పద" అని అది మళ్లీ నక్క వెంబడి బయలుదేరి వచ్చింది.
యీ సారి సింహం ఓపిక పట్టింది. అది బాగా దగ్గరికి వచ్చాక దొరికించుకొని దాన్ని ఒక్క దెబ్బకే విజయవంతంగా చంపేసింది.
అయితే ఆ సరికి దానికి బాగా దాహం అవుతున్నది. 'ముందు నీళ్లు త్రాగి వస్తే, ఆనక కడుపారా మాంసం తినచ్చు' అని అది గాడిద శరీరానికి నక్కని కాపలాగా ఉంచి, తను నది దగ్గరికి వెళ్లింది. అట్లా వెళ్లిన సింహం వెనక్కి తిరిగి వచ్చేంత వరకు తాళలేక పోయిందినక్క!
అది గబగబా గాడిద మెదడును, గుండెను, రుచిగా ఉండే ఇతర భాగాలను గుటుక్కుమనిపించి, ఏమీ ఎరగని దాని తీరున, మామూలుగా కూర్చున్నది.
సింహం వచ్చి చూసే సరికి, గాడిద శరీరంలో ముఖ్యమైన భాగాలేవీ లేవు.
"అరే, దీని మెదడు, గుండె, కాలేయం ఏమైనాయి?" అని అడిగిందది నక్కని, ఆశ్చర్యపోతూ.
"అయ్యో! యీ గాడిదకు అసలు అవేవీ లేవు ప్రభూ! మెదడు, గుండె ఏ కొంచెం ఉన్నా ఆ గాడిద రెండోసారి తమరి గుహ దగ్గరికి వచ్చేందుకు సాహసించేదా, మీరే చెప్పండి " అన్నది నక్క వినయం నటిస్తూ.