ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

TEMPLES INFORMATION ABOUT DAKSHINA KASI - ALAMPURAM TEMPLES IN TELUGU


అలంపురం (దక్షిణకాశి )ఆలయాల సందర్శనం 

మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా, తుంగభద్ర నదుల సంగమ ప్రదేశం లో తుంగభద్ర ఉత్తరవాహిని గా ప్రవహిస్తున్న పుణ్యతీర్థం అలంపురం. దక్షిణ కాశి గా పేరెన్నిక గన్న పుణ్యభూమి అలంపురం. మాతా జోగులాంబా దేవి ,బాల బ్రహ్మేశ్వరులు వెలసిన దివ్యథామం. నవ బ్రహ్మ ఆలయాలు కొలువు తీరిన దివ్యక్షేత్రం. అష్టాదశ తీర్థాలలో ముఖ్యమైనదిగా చెప్పబడే పాప వినాశినీ తీర్థం వెలసిన చోటు. కూడలి సంగమేశ్వరుడు కొలువు తీరిన భూమి. శ్రీ యోగానంద నరసింహస్వామి, శ్రీసూర్యనారాయణ స్వామి కొలువుతీరిన క్షేత్రం ఈ అలంపురం. ఆలయాల సమూహాలతో అహో! అన్పించిన క్షేత్రం అలంపురం.

జాతీయ రహదారి పై కన్పించే తోరణ ద్వారము 

మహామహులచే నిర్మించబడుతున్న ఆలయాలతో అలా, అలా పెరిగి పోతున్న ఈ క్షేత్రాన్ని చూచి ఒక మహానుభావుడు అలం – పురం అన్నాడట. సంస్కృతంలో అలం అంటే చాలు అని అర్థం. పురం అలం (ఇక పట్టణం పెరగటం చాలు) అప్పటినుండి ఈ పట్టణానికి అలం పురం అ పేరు వచ్చిందని ఒక పండిత కవి చమత్కరించారు.
శ్రీ జోగులాంబా ఆలయ రాజగోపురం
అలంపురం గా పిలవబడుతున్న ఈ గ్రామం ప్రాచీన శాసనాలలో “హలంపురం,” “హతంపుర,” “అలంపురం” అనీ, స్థలపురాణం లో “హేమలాపురం” అని వ్యవహరించబడింది. గ్రామదేవత ఎల్లమ్మ పేరున “ఎల్లమ్మ పురం” గా ఉండి.క్రమం గా హేమలాపురమై ఉండవచ్చు నని కూడ కొందరు భావిస్తున్నారు
క్రీ.శ 6.7 శతాబ్దాలలో ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన బాదామి చాళుక్యులు అలంపురం లోని నవబ్రహ్మఆలయాలను కట్టించారు. “పరమేశ్వర “బిరుదు నామం తో పరిపాలన కొన సాగించిన రెండవ పులకేశి కాలం లో ఈ ఆలయాల నిర్మాణం ప్రారంభమై రెండు వందల సంవత్సరాల పాటు నిర్మాణ కార్యక్రమం కొనసాగింది. క్రీ.శ 566- 757 లో మథ్యకాలం లో అలంపురం ఆలయాల నిర్మాణం జరిగినట్లు పరిశోథకులు భావిస్తున్నారు. అర్క బ్రహ్మ ఆలయం లోని మండప స్థంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య వేయించిన దాన శాసనం లభిస్తోంది.
అనంతరం రాష్ట్ర కూటులను జయించిన కళ్యాణి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని క్రీ.శ 973-1161 వరకు పాలించారు. వీరి కాలంలో అలంపుర క్షేత్రం లో యోగ నారసింహాలయం, సూర్య నారాయణ స్వామి ఆలయం, నదీ తీరఘట్టాలు, పాపానాశినీ తీర్థం లోని ఆలయాలు నిర్మించబడ్డాయి. గర్భగుడి చిన్నదిగా, దాని ముందు అంతరాళ మండపం, మెట్ల వరుసల్లా ఆలయ విమానం, ద్వారబంథాలు నల్లరాతితో చెక్కబడటం అనేవి వీరి ఆలయ నిర్మాణ శైలి గా పరిశోథకులు గుర్తించారు.
కాకతీయుల కాలం లో” వీరపూజ ‘అనే కొత్త ఆచారం వాడుక లోకి వచ్చింది. దేశానికి అరిష్టాలు వచ్చినప్పుడో, రాజు క్షేమం కోసమో శైవ వీరులు ఆత్మార్పణ చేసుకోవడం అలవాటుగా మారింది. అటువంటి వీరులకు గుడులు కట్టించేవారు. వీటినే “వీరశిల“లని పిలుస్తారు. ఇవి అలంపురం ప్రాంతంలోనే కాదు. ఆంధ్ర రాష్ట్ర మంతటా కూడ కన్పిస్తున్నాయి.
శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ 1521 లో రాయచూరు ను ఆక్రమించుకొని చెన్నిపాడు మీదుగా అలంపూరు కు వచ్చాడు. ఇక్కడి బాలబ్రహ్మేశ్వర స్వామికి, యోగానంద నరసింహస్వామికి పూజలు చేసి దానాలు సమర్పించినట్లు శాసనాలున్నాయి.
యోగనరసింహ ఆలయం లోని శాసనాలు
స్థలపురాణం లో అలంపురం క్షేత్రాన్ని” భాస్కర క్షేత్రమని”,”పరశురామ క్షేత్రమని”, “దక్షిణ కాశి” యని వర్ణించారు. కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా పోలిక లున్నాయి. కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గర్లోనే త్రివేణీ సంగమం ఉంది. అలంపురం లో తుంగభద్ర ,బ్రహ్మేశ్వరుడు, జోగులాంబ, పాపనాశిని,మణికర్ణిక మొదలైన 64 ఘట్టాలున్నాయి. దగ్గర్లోనే కృష్ణా,తుంగభద్ర సంగమ ప్రదేశ ముంది. అంతేకాదు ఔరంగజేబు మసీదు కాశీ ఆలయాన్ని ఆనుకొని ఉంటే షాఅలీ పహిల్వాన్ దర్గా అలంపురం ఆలయానికి ఆనుకొని ఉంది.
శ్రీ బాలబ్రహ్మేశ్వర ఆలయ తోరణ ద్వారం
ఈ క్షేత్రం లో బ్రహ్మదేవుడు ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. శంకరుడు బాలుని రూపం లో బ్రహ్మధేవునకు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు బాల ఈశ్వరుని దర్శించి, శివ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇక్కడ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని ఒక ఐతిహ్యం. అందుకే ఈ క్షేత్రం లో బ్రహ్మ విగ్రహాలు ఎక్కువగా కన్పిస్తాయి.
బ్రహ్మేశ్వర స్వామి ఆలయ శిఖరం, ధ్వజస్థంభము
స్థలపురాణం లో ఈ లింగము జ్యోతిర్ జ్వాలామయం గా వర్ణించబడింది.దీన్ని అర్చించిన, స్పృశించినా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పబడింది.ఈ ఆలయ ప్రదక్షిణ పథాన్ని, ప్రాకార, ముఖమండపాలను క్రీ.శ 702 లో చాళుక్య విజయాదిత్యుడు కట్టించాడు. బాల బ్రహ్మేశ్వరుని ఆలయ మండపం లో వివిథ దేవతామూర్తుల విగ్రహాలెన్నో మనకు దర్శన మిస్తాయి. రససిద్ధి వినాయకుడు, ఉమామహే శ్వరులు, ద్విసింహ వాహిని యైన దుర్గాదేవి, షోడశ భుజ ఉగ్ర నరసింహుడు, మొదలైనవి తప్పక చూడవలసిన అపురూప శిల్పాలు. ఆలయ విమానం పై మహా ఆమలక శిఖరంచాళుక్య నిర్మాణ శైలికి దర్పణం గా నిలుస్తోంది
బాలబ్రహ్మేశ్వరుని దివ్యరూపం
పూర్వం ఇక్కడే జమదగ్ని ఆశ్రమం ఉండేదట. పరశురాముని చేత నరకబడిన రేణుకాదేవి శిరస్సు నుండి వేరు పడిన మొండెము భూదేవి గా ఇచ్చట కొలువు తీరి సంతానం లేని స్త్రీలచే పూజ లందుకొని సంతానం ఇచ్చే దేవత గా సేవించబడుతోంది.
అష్టాదశ తీర్థాలలో ముఖ్యమైనది గా చెప్పబడుతున్న పాపవినాశినీ తీర్థం సర్వపాపాలను హరింపచేస్తుందని భక్తుల విశ్వాసం.
షోడశ భుఙ నారసింహుడు
అలంపురం ఆలయాలను రససిద్ధుడు కట్టించాడట. కాశీవిశ్వేశ్వరుని ప్రేరణ తో ఈ క్షేత్రానికి వచ్చి క్షేత్రపాలకులను గూర్చి సిద్ధుడు తపస్సు చేశాడు.బ్రహ్మేశ్వరుడు శిరస్సు నుండి, జోగులాంబ నోటినుండి,గణపతి బొడ్డు నుండి రసాన్నిఇచ్చారట. ఆ రసం తో సిద్ధుడు పరుసవేదిని తయారుచేసి, ఆలయాలను ప్రారంభించాడట. విలసద్రాజు అనే వాడు ఆ పరుసవేది ని దోచుకోవడానికి దండెత్తి రాగా సిద్ధుడు ఆలయనిర్మాణం పూర్తికాకుండానే బ్రహ్మేశ్వరునిలో లీనమై పోయాడు. ఈ గాథ ప్రవేశద్వారం ముందు వేయబడిన తోరణస్థంభం పైన చెక్కబడివుంది.

ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలలో కన్పించేవన్నీ శివలింగాలే. వాటి పేర్లు ఏవీ పురాణ ప్రసిద్ధమైన నవ బ్రహ్మలవి కావు. ఆ పేర్లు వరుసగా బాల బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,స్వర్గ బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ. ఈ పేర్లు సిద్ధుడు పరుసవేది కోసం వాడిన మూలికల పేర్లని కొందరి భావన. అందుకే దీనిని బ్రహ్మేశ్వర క్షేత్రం అని కూడ పిలుస్తారు. నవబ్రహ్మ ఆలయాలలో తారకబ్రహ్మ ఆలయం ముష్కరులచేత ఏనాడో నాశనం చేయబడింది.
ఈ ఆలయ మహాద్వారం కారణాంతరాల వల్ల మూసివేయబడింది. ప్రాకార ద్వారమే ఇప్పుడు ప్రవేశ ద్వారం గా వాడబడుతోంది. మహాద్వారానికి క్రిందభాగం లో ఉన్న రెండు చిన్నగుళ్లల్లో కుడి ఎడమలు గా కంచి కామాక్షి, ఆమెకు ఎదురుగా ఏకాంబరేశ్వరుడు దర్శనమిస్తారు. శ్రీ కామాక్షి విగ్రహాన్ని పెర్మాడి రాయని మంత్రి అయితరాజు ప్రథాని క్రీ.శ 1353 వ సం.లో ప్రతిష్ఠించాడు.
శ్రీ కామాక్షీ దేవి
పదునెనిమిది శక్తిపీఠాలలో నాలుగు మన రాష్ట్రం లోనే ఉన్నాయి.ఐదవ శక్తి పీఠమైన శ్రీ జోగులాంబా మాత ఆలయం క్రీ.శ 7వ శతాబ్దం లో నిర్మించబడింది. అయితే 14 వ శతాబ్దం లో ముష్కరుల దండయాత్ర ల్లో అమ్మవారి ఆలయం థ్వంసం చేయబడింది. స్థానికులచే అమ్మవారి విగ్రహం బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని చిన్నగుడిలోనికి చేర్చబడింది. అదే సమయం లో ఈ ప్రాచీన ఆలయం తో పాటు మిగిలిన ఆలయాలు నాశనం కాకుండా విజయనగరచక్రవర్తి రెండవ హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు, తండ్రి ఆజ్ఞానుసారం సైన్యం తో వచ్చి ముస్లిం సైన్యాన్ని తరిమికొట్టి అలంపురం క్షేత్రాన్ని కాపాడాడు. 600 సంవత్సరాల తర్వాత అమ్మవారికి ప్రాచీన ఆలయమున్న ప్రదేశం లోనే మరలా ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీ జోగులాంబా మాత దివ్యమంగళ విగ్రహం
" లంబస్తనీం వికృతాక్షీం ఘోరరూపాం మహాబలాం ! 
ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం !!"
అలంపురం కోట లోపల శ్రీ యోగానంద నరసింహ ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయాలున్నాయి. క్రీ.శ 9-10 శతాబ్దాల్లో నిర్మించబడిన ఈ ఆలయాలు శిథిలం కాగా త్రిభువనమల్లుని కాలం లో పునరుద్ధరణ జరిగినట్లు ఇక్కడి శాసనం వలన తెలుస్తోంది.
నృసింహ ఆలయ ప్రదాన ద్వారం
శ్రీ నరసింహస్వామిని ఆ రోజుల్లో “మాథవ దేవర “ అని పిలిచేవారు. ప్రవేశద్వారం ప్రక్కనే ఎత్తైన ఆంజనేయ విగ్రహం కన్పిస్తుంది. ఈ విగ్రహం పై శంఖ చక్రాలున్నాయి. ఈ సంప్రదాయం విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణరాయల వారి గురువైన వ్యాసరాయల వారిదని ఇంతకు ముందు చెప్పుకున్నాం. అంటే ఈ విగ్రహం 15 వ శతాబ్దం లో ప్రతిష్ఠించ బడిందన్నమాట.( చూ. బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం )
ఈ ఆలయంలో మూడు గర్బగుడులున్నాయి. ఇలాంటి ఆలయాన్ని “త్రిక దేవాలయం” అని పిలుస్తారు. మథ్య ఆలయం లో యోగ నరసింహస్వామి, ఆయనకు కుడివైపు మాథవీశక్తి, ఎడమవైపు చాకమ్మ విగ్రహాలున్నాయి. కళ్యాణమండపం, ప్రథానగోపురం ప్రత్యేకశైలి లో నిర్మించబడ్డాయి.ఈ ఆలయం లో రెండు శాసనాలు కూడ మనకు కన్పిస్తాయి.
శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం నరసింహస్వామి ఆలయానికి వెళ్లే దారిలోనే కన్పిస్తుంది. ఇది కూడ త్రిక దేవాలయమే. రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట లో అక్కన్న- మాదన్నలు కట్టించిన ఆలయం కూడ ఇదే నిర్మాణ శైలిలో ఉండటాన్ని మనం ఇంతకు ముందే గమనించాము
శ్రీ సూర్యనారాయణ స్వామి దివ్యరూపం
ఈ ఆలయం మూడువైపులా మూసి,ఒక వైపు మాత్రమే ప్రవేశముంది. మథ్య ఉన్న గర్భాలయం లో శ్రీ సూర్యనారాయణస్వామి, ఇరువైపులా ఆలయాల్లో శివలింగాలున్నాయి. ప్రవేశద్వారం ప్రక్కనే ఆంజనేయ విగ్రహం ఉంటుంది. ఈ ఆలయం లో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి పాదుకలు థరించి ఉండటం విశేషం..
శ్రీ జోగులాంబా ఆలయదృశ్యం
పాపావినాశినీ తీర్థం అలంపురం క్షేత్రం లోకి ప్రవేశిస్తుంటే కుడివైపు మార్గం లో ½ కి మీ లోపలికి ఉంటుంది. ఇవి కూడ 9-10 శతాబ్దాల్లో నిర్మించబడిన ప్రాచీన ఆలయ సముదాయాలే. ఇక్కడ ప్రథానదైవం పాపనాశేశ్వరుడు .ఈ లింగం ఆకుపచ్చ రంగులో ఉండటం ఒక ప్రత్యేకతగా చెపుతారు. అష్టాదశ తీర్థాలలో చాల ముఖ్యమైనదిగా ఈ పాపవినాశినీ తీర్థాన్ని చెప్పుకుంటారు. విద్యాగణపతి, అష్టభుజ మహిషాసురమర్ధిని చూడదగ్గ శిల్పాలు.
పాపవినాశినీ తీర్థం


కూడలి సంగమేశ్వర ఆలయం పాపవినాశినీ తీర్థానికి తూర్పు గా ఉంటుంది. ఇది కూడ పాపవినాశినీ ఆలయాల వలెనే శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నుంచి రక్షించడానికి ఇక్కడకు తరలించి, పునర్నిర్మించారు. ఈ ఆలయం గోడలు, పైకప్పు పైన ఉన్నఅద్భుతమైన శిల్పవిన్యాసం ఈ ఆలయ ప్రత్యేకత.
నందిమండపం
ప్రాకార శిల్పాలు 
అర్థ నారీశ్వర శిల్పం
ఆలయానికి సమీపం లోనే మ్యూజియం కూడ ఉంది. ఆం.ప్ర.పర్యాటక శాఖ వారి “హరిత” హోటల్ తో పాటు దేవస్థానం వసతి గదులు కూడ ఉన్నాయి. శ్రీ అమ్మవారి ఆలయం లో సాయంత్రం 7.00 గం.లకు, శ్రీ స్వామి వారి ఆలయం లో సాయంత్ర 7.30గం.లకు మహా మంగళహారతి ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా దర్శించి, తరించవలసిన దృశ్యమది. ఒక రోజు ఉండేటట్లుగా ప్రణాళిక వేసుకొని,ఉండి చూడవలసిన దివ్యక్షేత్రం అలంపురం.
బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్తకల్పద్రుమాయ చ
కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళమ్.