ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

ANCIENT TELUGU PURANA STORY / PURANA KATHA OF THE GREAT MAHABHARATHA WARRIOR - EKALAVYA


లోకప్రసిద్ధి చెందిన ఏకలవ్యుని గాధ

రామాయణం, మహాభారతం, పురాణాలు, వ్యాసాలు వంటి ఇతిహాసాలలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రత్యేకమైన పాత్రలలో ఏకలవ్యుడు ఒకడు. ఏ గురువు దగ్గర కూడా శిష్యరికం చేయకుండానే విలువిద్యలో ఆరితేరిన ఘనుడు ఇతను. కళ్లతో చూడకుండానే కేవలం శబ్దం ఆధారంగానే బాణాన్ని ప్రయోగించి, లక్ష్యాన్ని ఛేదించేవాడు. ఒక సాధారణ ఎరుకల (నిషాద) కుటుంబంలో జన్మించిన ఈ మహావీరుడు.. విలువిద్యలో అగ్రగణ్యునిగా స్థానాన్ని పొందుపరుచుకున్నాడు. అటువంటి సాహసవంతుడైన ఏకలవ్యుని గాధను ఒకసారి తెలుసుకుందాం....
* పురాణాలలో ఏకలవ్యుని ప్రాధాన్యత :
పూర్వం ఒక ఎరుకల (నిషాద) కుటుంబంలో ఏకలవ్యుడు జన్మించాడు. అతని తండ్రి హిరణ్యధన్యుడు. ఏకలవ్యుడు ఒక సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ... విలువిద్యలో ప్రావీణ్యం పొంది, అందులో అగ్రగణ్యునిగా నిలవాలని కోరుకుంటాడు. ఈ పట్టుదలతోనే ఇతను ఒకరోజు అస్త్రవిద్యలో మహామేధావి అయిన ద్రోణాచార్యుని దగ్గరకు విలువిద్యలో శిక్షణ పొందాలని వెళతాడు.
ఏకలవ్యుడు, ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి... ‘‘ఓ గురుదేవా! నేను ఏకలవ్యునుని. మీ దగ్గర శిష్యునిగా చేరి, మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తూ, విలువిద్యను నేర్చుకోవాలని వచ్చాను. నా కోరికను మన్నించి, ఆశీర్వదిస్తారని నేను ఆశగా ఎదురుచూస్తున్నాను’’ అని తన మనుసులోని మాటను చెబుతాడు. కానీ ఏకలవ్యుడు ఒక నిషాద కుటుంబానికి చెందిన బాలుడు కావడంతో ద్రోణాచార్యునికి అతనిని శిష్యునిగా అంగీకరించడానికి ఇష్టం వుండదు. అయితే ద్రోణుడు తన మనసులోని మాటను అతనికి చెప్పి బాధ పెట్టించకూడదని ఏకలవ్యునితో... ‘‘చూడు నాయనా! నువ్వు పుట్టుకతోనే విలువిద్యలో ఆరితేరినట్టుగా వున్నావు. ఇలాగే ఇంకా బాగా సాధన చెయ్యి. అందులో వున్న రహస్యాలన్నీ తెలుస్తాయి’’ అని అంటాడు.
ద్రోణుడు చెప్పిన మాటలను ఆశీర్వాదంగా భావించి, ఏకలవ్యుడు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోతాడు. అంతేకాకుండా... దైవంకంటే ఎక్కువగా కొలిచే గురువు ద్రోణాచార్యుని విద్రహాన్ని తయారుచేసుకుని, భక్తిగా నమస్కరించుకునేవాడు. ఆ విగ్రహాన్నే ప్రత్యక్ష గురువుగా భావించి, ప్రతిరోజూ కఠోర సాహసాలు చేస్తూ విలువిద్యలో నైపుణ్యం సంపాదించుకున్నాడు. కళ్లతో చూడకుండానే శబ్దాన్ని బట్టి బాణాన్ని ప్రయోగించేంత ప్రావీణ్యాన్ని పొందాడు.
ఇదిలా వుండగా... భీష్మ పితామహుడు తన కౌరవ, పాండవులకు అస్త్ర విద్యలు నేర్పించేందుకు ద్రోణాచార్యునిని గురువుగా నియమించాడు. అయితే ద్రోణుడు ఒక గురువుగా కాకుండా తండ్రిగా వారందరికీ అన్నివిధాలుగా సహాయం చేస్తూ అస్త్రవిద్యలను నేర్పించేవాడు. కానీ కౌరవ, పాండవులందరిలో అర్జునుడు విలువిద్యలో మిన్నగా వుంటూ, తన ప్రతిభను చాటుకున్నాడు. దీంతో ద్రోణుడికి అర్జునునిపై అపారమైన ప్రేమ కలుగుతుంది. తన అనుంగు శిష్యునిగా భావించి విలువిద్యలో వున్న అన్ని రహస్యాలను నేర్పిస్తాడు.
ఒకనాడు ద్రోణాచార్యుడు తన శిష్యుడయిన అర్జునునితో కలిసి అడవిలో వేటకు వెళ్లాడు. కొంతదూరం వెళ్లిన తరువాత వారి వెంటే వస్తున్న ఒక కుక్క అరిచింది. అదే సమయంలో కొంతదూరంలో వున్న ఏకలవ్యుడు కుక్క శబ్దాన్ని విని, ఏదో అరిష్టం జరుగుతోందని భావించి, కుక్క మొరిగిన దిశగా బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం సరిగ్గా కుక్కకు తగిలి చనిపోయింది. ఏకలవ్యుడు అదేమిటో తెలుసుకుందామని శోధిస్తూ.. కుక్క చనిపోయిన ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడే వున్న తన గురువును చూసి, ఆనందమయంలో మునిగిపోతాడు. అలాగే ద్రోణాచార్యుడు కూడా ఏకలవ్యుని విలువిద్యా చాతుర్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడయిపోతాడు.
దీనినంతటిని గమనిస్తున్న అర్జునునికి ఒక్కసారి కోపం, దు:ఖం పొంగుకు వస్తాయి. ద్రోణాచార్యుని విగ్రహం కూడా అక్కడే వుంటుంది. అప్పుడు అర్జునుడు తన మనసులో... ‘‘తనను విలువిద్యలో అందరికంటే ప్రతిభావంతుడిగా తయారుచేస్తానని గురువు నాకు మాటిచ్చారు. కానీ ఇచ్చిన మాట తప్పి, నన్ను మాయచేసి ఒక ఎరుకులవాన్ని ప్రతిభాశాలిగా తీర్చిదిద్దారు’’ అని అనుకుంటాడు. తన కోపాన్ని మింగుకోలేక అర్జునుడు, ద్రోణాచార్యుడితో... ‘‘గురువుగారు... మీరు నాకిచ్చిన మాటను తప్పారు. మా మాటకు విరుద్ధంగా ఒక ఎరుకులవాన్ని విలువిద్యలో ప్రతిభావంతునిగా తీర్చిదిద్దారు. ఎందుకు?’’ అని బాధపడుతూ చెప్పాడు.
ఈ విధంగా అర్జునుడు బాధపడటాన్ని చూసి, ద్రోణాచార్యుడు సహించలేకపోయాడు. వెంటనే ఏకలవ్యునివైపు చూసి.. ‘‘ఏకలవ్యా! నువ్వు విలువిద్యలో నిజంగానే ఘనతను సాధించావు. నీకు సాటిలేరని నిరూపించుకున్నావు. మరి, దీనికి నా గురుదక్షిణ ఏది?’’ అని అడుగుతాడు. ఈ మాటలు విన్న ఏకలవ్యుని ఆనందానికి అంతులేకుండా పోయింది. కన్నీళ్లతో కాళ్లమీద పడి... ‘‘నేను ధన్యుడినయ్యాను స్వామి! మీరు ఏమైనా కోరుకోండి. నేను ఇవ్వగలిగింది ఏమైనా ఇస్తాను’’ అని అంటాడు. అప్పుడు ద్రోణుడు.. ‘‘నీ కుడిచేతి బొటనవేలు నాకు కావాలి. ఇస్తావా?’’ అని అడుగుతాడు. ఏకలవ్యుడు మరేమీ ఆలోచించకుండా, సంతోషంగా గురువుదక్షిణగా తన బొటనవేలుని కోసిచ్చాడు. తనకు ప్రాణానికి ప్రాణమైన విలువిద్యను త్యాగం చేసి, ఒక మంచి శిష్యునిగా చరిత్రలోనే నిలిచిపోయాడు.