ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

DETAILED ARTICLE ABOUT MARGASIRA LAKSHMI VRATHAM - HOW TO PERFORM LAKSHMI PUJA - THIDHULU - PANDUGALU ETC INFORMATION IN ONE ARTICLE IN TELUGU


మార్గశిర లక్ష్మీ వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా!?

మార్గశిర లక్ష్మీ వ్రతాన్ని ఈ నెలలో ఏ గురువారమైనా చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. పూజ చేసుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి ఆహారం తీసుకోవచ్చు.
గురువారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, పూజగదిని శుభ్రం చేసి కడిగి ముగ్గులు పెట్టాలి. పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. బియ్యప్పిండితో ఎనిమిది దళాల పద్మాన్ని వేసి దానిమీద పసుపు కుంకుమలు జల్లి లక్ష్మీదేవిని నిలిపేందుకు పీఠాన్ని ఉంచాలి.
పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఉంచాలి. అయిదు తమలపాకులు, అయిదు వక్కలు, అయిదు నాణాలు, అయిదు గరికపోచలు ఉంచాలి. దీపం వెలిగించి, ఐదు రకాల నైవేద్యాలను సమర్పించాలి. కొందరు అయిదు పిడకలను కూడా లక్ష్మీదేవివద్ద ఉంచుతారు.
ఉద్దరిణితో నీటిని లక్ష్మీదేవిమీద చిలకరిస్తూ, పూవులు జల్లుతూ, అక్షతలు జల్లుతూ మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ దేవిని స్తుతిస్తారు. చివరికి ప్రదక్షిణలు చేసి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి పూజను భక్తిగా చేసుకున్నవారికి అపార సంపదలు లభిస్తాయని, సుఖశాంతులు ప్రాప్తిస్తాయని చెప్పే అనేక నిదర్శనాలు ఉన్నాయని పండితులు అంటున్నారు.

మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు

ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.
ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.
''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.
అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.
దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.
ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.
కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.
మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.
రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.
అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.

మార్గశిర మాస విశిష్ఠ తిథులు - పండుగలు

మార్గశిరమాసం - శుక్లపక్షం :

పాడ్యమి : గంగాసాన్నం 
విదియ : 
తదియ : ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతం 
చవితి : వరద చతుర్థి, నక్త చతుర్థి – వినాయకపూజ 
పంచమి : ‘నాగపంచమి’ నాగపూజ ( స్మృతి కౌస్తుభం ) ‘శ్రీ పంచమి వ్రతం’ ( చతుర్వర్గ చింతామణి) 
షష్ఠి : సుబ్బారాయుడి షష్ఠి, స్కందషష్ఠి, చంపాషష్ఠి, ప్రవార షష్ఠి వ్రతాలు – సుబ్రహ్మణ్య పూజ, రైతుల పండుగ 
సప్తమి : మిత్ర సప్తమి "ఆదిత్య ఆరాధన " ( నీలమత పురాణం ) 
అష్టమి : కాలాష్టమీ వ్రతం 
నవమి :
దశమి : 
ఏకాదశి : ముక్కోటి ఏకాదశి, మోక్షదైకాదశి, సౌఖ్యదా ఏకాదశి, గీతాజయంతి – ఏకాదశీ ( ఉపవాస) వ్రతం కృష్ణ పూజ, భగవద్గీతా పారాయణ
ద్వాదశి : ద్వాదశీ పారణ, తీర్థదినం, అఖండ ద్వాదశాదిత్య వ్రతం
త్రయోదశి : హనుమద్ వ్రతం, అనంగ (మన్మధ) త్రయోదశీ వ్రతం 
చతుర్దశి : చాంద్రాయణ వ్రతం ఆరంభ తిథి - రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి గౌరీదేవిని ఆరాధించాలి 
పూర్ణిమ : కోరల పున్నమి, దత్త జయంతి - చంద్ర ఆరాధన, దత్త చరిత్ర పారాయణం, సాయి సత్చరిత్ర పారాయణం.
మార్గశిర మాసం - కృష్ణపక్షం :
పాడ్యమి : శిలావ్యాప్తి వ్రతం 
విదియ :
తదియ : 
చవితి : సంకష్ట హర చతుర్థి 
పంచమి : 
షష్ఠి : 
సప్తమి : ఫలసప్తమీ వ్రతం 
అష్టమి : అనఘాష్టమీ వ్రతం, కాలభైరవాష్టమి/ – కాలభైరవపూజ 
నవమి : రూపనవమి వ్రతం 
దశమి : 
ఏకాదశి : సఫల ఏకాదశీ వ్రతం, వైతరణీ వ్రతం, ధనద వ్రతం 
ద్వాదశి : మల్లి ద్వాదశి వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం 
త్రయోదశి : యమత్రయోదశి వ్రతం, మాస శివరాత్రి 
చతుర్దశి : 
అమావాస్య : వకుళామావాస్య, అమావాస్య వ్రతం - ఆవు పాలతో పరమాన్నం వండి దేవునికి నివేదన చేయడం సర్వ శుభస్కరం
ధనుర్మాసం : సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన నాటి నుండి – మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసంగా పిలుస్తారు. సంక్రాంతి నెలపెట్టుట అని కూడా పేర్కొంటారు. సాధారణంగా ప్రతీనెలా 14,15 తేదీలలో సూర్యుడు ఒకరాశినుండి మరో రాశికి ప్రవేశిస్తుంటాడు. ఈ మాసంలో "తిరుప్పావై" రోజుకొక్క పాశురం చొప్పున ప్రతి వైష్ణవ ఆలయంలోను చేస్తారు. గోదా దేవిని ( సాక్షాత్తు లక్ష్మీదేవి ) పూజిస్తారు. తిరుప్పావై ప్రవచనాలు, ప్రత్యెక పూజలతో వైష్ణవ ఆలయాలు చాల సందడిగా ఉండే మాసం ఇది. ఈ ధనుర్మాసం నెలరోజులూ కన్నె పిల్లలు తెల్లవారుజ్హామునే లేచి ఇళ్ళముందు కలాపి చల్లి చక్కని రంగవల్లులతో, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. వీధులన్నీ రంగురంగుల ముగ్గులతో కళ కళ లాడుతూ ఉంటాయి.
తీర్థ దినం : ఈ భూలోకంలో ఉన్న మూడు కోట్ల తీర్థాలు, మార్గశిర సుద్ధ ద్వాదశి నాడు "అరుణోదయ (సూర్యోదయ)" సమయంలో తిరుమల కొండపై గల స్వామీ పుష్కరిణిలో ప్రవేశించి ఉంటాయని పురాణ ప్రమాణం. అందుకే, స్వామి పుష్కరిణి "తీర్థ దినం" గా పూజిస్తారు
మోక్షదా ఏకాదశి : ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని చెబుతారు. అందుకే దీనిని మోక్ష ఏకాదశిగా పేర్కొంటారు. ఈరోజు ‘ఏకాదశీవ్రతం’ ఆచరిస్తారు. పూర్వం వైఖానసుడు అని ఒకరాజు ఉండేవాడు. అతనికి ఒకనాడు తన తండ్రి నకరంలో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు అతను మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి ‘మోక్షదా ఏకాదశి’ అని పేరువచ్చింది.
తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకతా ఉంది. కురుక్షేత్రంలో తాతలనూ, తండ్రులనూ, బంధుగణాల్నీ చూసి అస్తస్రన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసిందీ రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజును "గీతాజయంతి" గా వ్యవహరిస్తారు. ఆవేళ కృష్ణుణ్ని భక్తీ శ్రద్ధ లతో పూజించి, గీతా పారాయణ చేయడం నిర్దేసించబడింది.


మార్గశిర లక్ష్మీ వ్రతం

మార్గశిర మాసం వచ్చేసింది. ఈ నెలలో ముఖ్యంగా మార్గశిరంలో వచ్చే ఏ గురువారమైనా లక్ష్మీ వ్రతం చేసుకోవడం ఆనవాయితీ. ఈ నెలలో లక్ష్మీవ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, సర్వ సౌఖ్యాలూ ప్రాప్తిస్తాయని పూరాణాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించిన కథ ఒకటి చూడండి.
పూర్వం ఒక చిన్నారి సవతి తల్లి పెట్టే బాధలు పడలేక అవస్త పడుతోంది. ఆమెను చూస్తే అందరికీ జాలిగా ఉండేది. ఒకరోజు ఆలయ పూజారి ఆ చిన్నారిని చేరదీసి ''అమ్మా! నువ్వు లక్ష్మీదేవి పూజ చేసుకో.. నీ కష్టాలన్నీ తీరతాయి..'' అని చెప్పాడు.
ఆమె దగ్గర లక్ష్మీదేవి ప్రతిమ అయినా లేదు. దాంతో మట్టితో బొమ్మను తయారుచేసి, ఆ విగ్రహాన్నే లక్ష్మీదేవిగా భావించి ప్రార్ధించసాగింది. సవతితల్లి తన కూతుర్ని ఆడించమని చేతిలో ఉంచి, ఆమెకోసం ఇచ్చిన బెల్లంలోంచి చిన్న ముక్క తీసుకుని లక్ష్మికి నైవేద్యం సమర్పించేది.
కొన్నాళ్ళకు ఆమె పెళ్లయింది. మంచి వరుడు వచ్చాడు. ఆమె వెళ్తూ వెళ్తూ తాను చేసుకున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసికెళ్ళింది. ఆమె చేసిన పూజాఫలంతో అత్తగారింట్లో సిరిసంపదలు ప్రవాహంలా వచ్చిపడ్డాయి. అయితే ఆమె వెళ్ళిన మరుక్షణం పుట్టింట్లో పేదరికం తాండవించింది.
సంగతి తెలిసి ఆమె బాధపడింది. సవతితల్లిమీద ఎలాంటి కోపతాపాలూ లేవు. తమ్ముడు వచ్చి పరిస్థితి చెప్పగా అయ్యో అనుకుని కొన్ని బంగారు కాసులను మూటకట్టి ఇచ్చింది. కానీ తమ్ముడు దారిలో వాటిని పారేసుకున్నాడు. అలా రెండోసారి, మూడోసారి కూడా బంగారు కాసులను ఇచ్చినా, తమ్ముడు పారేసుకున్నాడు. సోదరి ఇచ్చినా తాను నిలుపుకోలేకపోయానని అతను బాధపడ్డాడు.
కొన్నాళ్ళ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళింది.
అక్కడ సౌభాగ్యాలు రావాలని సవతితల్లితో ''అమ్మా! ఇవాళ మార్గశిర గురువారం.. చాలా మంచిరోజు.. నువ్వు ఏమీ తినకుండా, తలకు నూనె రాసుకోకుండా ఉండు.. లక్ష్మీదేవి వ్రతం చేసుకుందాం'' అంది.
కానీ ఆవిడ పిల్లలకు అన్నం పెడుతూ, ఆకలికి ఆగలేక తాను కూడా కొంచెం తింది.
అది విని కూతురు ''అయితే వచ్చే గురువారం చేసుకుందాం'' అని వాయిదా వేసింది.
రెండోవారం ఆ తల్లి పిల్లలతోపాటు తాను కూడా తలకు నూనె రాసుకుంది. నియమోల్లంఘన జరిగినట్లు తెలిసి కూతురు మళ్ళీ వచ్చేవారం అంటూ వాయిదా వేసింది.
ఆ తర్వాత మూడో గురువారం కూడా తల్లి నియమాలను పాటించలేకపోయింది.
ఇక కూతురు బాధగా ''అమ్మా! ఇదే ఆఖరి మార్గశిర గురువారం.. ఈసారి అయినా జాగ్రత్తగా ఉండు.. లేదంటే ఈ పేదరికం పోదు..'' అంటూ పదేపదే చెప్పగా, తల్లి భయంతో గుర్తు ఉంచుకుని నియమాలు పాటించింది.
మొత్తానికి చివరి మార్గశిర గురువారం నాడు తల్లితో కలిసి ఆమె లక్ష్మీదేవి వ్రతం చేసింది. అయితే తల్లి పెట్టిన నైవేద్యం లక్ష్మీదేవి స్వీకరించలేదు. కూతురు పెట్టిన నైవేద్యం స్వీకరించింది.
కూతురు వేడుకుంటూ అడగ్గా ''నీ తల్లి ఎన్నో తప్పులు చేసింది.. ముఖ్యంగా నువ్వు భక్తిగా నా ప్రతిమ చేసి, పూజ చేస్తోంటే కూడా అడ్డుకునేందుకు చూసింది...'' అంటూ సెలవిచ్చింది.
కూతురు తల్లితో విషయం చెప్పి ''అమ్మా! లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పుకో.. ఇకపై ఎన్నడూ పూజను అశ్రద్ధ చేయనని, పూజ చేసుకునేవారిని అడ్డుకోనని ప్రార్ధించు'' అని చెప్పింది.
తల్లి అలాగే వేడుకుంది. నిజంగానే చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందింది.
లక్ష్మీదేవి శాంతించి ఇద్దరికీ అభయమిచ్చి అంతర్ధానం అయింది.
ఈసారి ఆమె అత్తగారి ఇల్లే కాకుండా పుట్టిల్లు కూడా సిరిసంపదలతో తులతూగింది.
అదీ కథ.
మార్గశిర లక్ష్మీదేవి వ్రతానికి ఆడంబరాలు ఏమీ అక్కర్లేదు. లక్ష్మి విగ్రహాన్ని పెట్టి, నైవేద్యం సమర్పించి, భక్తిగా కొలిస్తే చాలు దేవి అనుగ్రహిస్తుంది. సర్వ సంపదలూ దొరుకుతాయి.