ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

BRIEF DESCRIPTION ABOUT ANTHARVEDI - EAST GODAVARI DISTRICT - SAKINETIPALLI MANDAL - ANDHRA PRADESH - INDIA - GODAVARI PUSHKARALU 2015 SPECIAL ARTICLE IN TELUGU


అంతర్వేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. అందమైన బంగాళాఖాతపు సముద్రమున గోదావరి నదీశాఖయైన వశిష్టానది సంగమము చెందు ప్రశాంత ప్రాంతము అంతర్వేది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంకు సమీపములో కల ఈ త్రికోణాకారపు దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి పురాతన ఆలయం కలదు.
కృత యుగము లోని మాట ఒకసారి నైమిశారణ్యం లో శౌనకాది మహర్షులు సత్రయాగం చేస్తున్న సమయం లో సూత మహాముని ద్వారా పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకొనుచూ ఒకరోజు అంతర్వేది గురించి సూత మహామునిని అడుగగా ఆ మహాముని అంతర్వేది నిగురించి బ్రహ్మ, నారదుల మధ్యజరిగిన సంవాదాన్ని శౌనకాది మహర్షులకు చెప్పుతాడు.
ఒకప్పుడు శివుని పట్ల చేసిన అపచారాలకు ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చేయాలని నిశ్చయించి, యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకొంటాడు. వేదికగా ఎన్నుకోబడిన కారణంగా ఈ ప్రదేశానికి అంతర్వేది (అంతర్, వేదిక) అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్ఠుడు ఇక్కడ యాగము చేసినందు మూలముగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ది గాంచినది.
ఒకానొక సమయం లో రక్తావలోచనుడు (హిరణ్యాక్షు ని కుమారుడు) అనే రాక్షసుడు వశిష్ఠ గోదావరి నది ఒడ్డున వేలాది సంవత్సరాలు తపస్సు చేసి, శివుని నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం, రక్తావలోచనుని శరీరం నుండి పడిన రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి తనంత పరాక్రమవంతులైన రక్తావలోచనులు ఉద్భవించాలని కోరుకొంటాడు. ఈ వరగర్వం తో లోక కంటకుడై రక్తావలోచనుడు యజ్ఞయాదులు చేసే బ్రాహ్మణులను, గోవులను హింసించేవాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడు కి వశిష్ఠుడు కి ఆసమయం లో జరిగిన సమరం లో విశ్వామిత్రుని ఆజ్ఙ పై ఈ రక్తావలోచనుడు వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు కుమారులను సంహరిస్తాడు. వశిష్ఠ మహర్షి శ్రీ మహావిష్ణువు ను ప్రార్థించగా మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై, గరుడవాహనం పై నరహరి రూపుడై రక్తావలోచనుని సంహరించడానికి వస్తాడు. నరహరి సుదర్శనము ను ప్రయోగించినప్పుడు, శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్తావలోచనుడి రక్తం పడిన ఇసుకరేణువుల నుంచి వేలాది రాక్షసులు జన్మించి, ఇంకా భీభత్సం సృస్టిస్తారు. నరహరి ఈ విషయం గ్రహించి, తన మాయాశక్తి ని ఉపయోగించి, రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నది లోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శనచక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఈ రక్తావలోచనుని సంహరించడం చేసిన తరువాత, వశిష్ఠుని కోరిక పై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి గా వెలిశాడు. ఈ రక్తకుల్య లోనే శ్రీమహావిష్ణువు అసురులను సంహరించిన తన చక్రాయుధము ను శుభ్రపరచుకొన్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రక్తకుల్య లో పవిత్రస్నానం చేస్తే సర్వపాపాలు పోతాయి అని చెబుతారు.
మొదటి ఆలయము శిధిలపరిస్థితిలో ఉన్నపుడు ఆలయ జీర్ణోర్ధరణకు పాటు పడిన వారిలో ముఖ్యులు శ్రీ కొపనాతి కృష్ణమ్మ. వీరు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు గ్రామ వాస్తవ్యులు. ప్రముఖ నౌకావ్యాపారవేత్త శ్రీ కొపనాతి ఆదినారాయణ గారు వీరి తండ్రిగారు. ప్రస్తుతపు ఆలయ నిర్మాణము ఈయన విరాళాలు మరియు కృషి ద్వారానే జరిగినది. ఆలయ ప్రధాన ముఖద్వారమునకు ముందు ఈయన శిలా విగ్రహము కలదు. ఈ ఆలయము చక్కని నిర్మాణశైలితో కానవచ్చును. దేవాలయము రెండు అంతస్తులుగా నిర్మించారు. దేవాలయ ప్రాకారముగా వరండా(నడవా) మాదిరి నిర్మించి మధ్యమధ్య కొన్ని దేవతా విగ్రహాలను ఏర్పాటు చేసినారు. ప్రాకారము సైతము రెండు అంతస్తుల నిర్మాణముగా ఉండి యాత్రికులు పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకొనుటకు ప్రకృతి తిలకించుటకు అనువుగా నిర్మించినారు. ఆలయమునకు దూరముగా వశిష్టానది కి దగ్గరగా విశాలమైన కాళీస్థలమునందు కళ్యాణమండపము నిర్మించినారు. ఈవిదంగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణము తిలకించే ఏర్పాటు చేసినారు. ఈ ఆలయం క్రీ.శ.300 కు పూర్వం నిర్మింపబడినదని అక్కడి కొన్ని విగ్రహలు చెపుతున్నాయి .