ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

NAVARATHRI DASARA FESTIVAL 3RD DAY 15-10-2015 ARTICLE IN TELUGU


నవరాత్రి  తృతీయం-తలమానికం!
శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం (15-10 -2015)
శ్రీమతి నయన కస్తూరి
రెండవ రోజు పూజ ముగించుకుని, తదియ నాటి అనగా తృతీయ అలంకార విశేషాలు తెలుసుకుందాము. దేవీ నవరాత్రులలో మూడవ నాడు అమ్మ వారు శ్రీ అన్నపూర్ణా దేవీ అలంకారంలో అలరారుతారు.
'భిక్షాందేహి కృపావలంబన కరీ, మాతాన్నపూర్ణే శ్వరీ!
అని ప్రార్ధిస్తూ,మూడవ రోజున ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవి గా అలంకరించి, ఆరాధిస్తారు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం. ఆ పరమాత్మే ఆది భిక్షువుగా బిక్షను స్వీకరించినట్లుగా మనకు అనేక పురాణ గాధల ద్వారా తెలుస్తోంది. అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తి కి ఆధారం. అందుకే మనం భోజనం చేసే ముందు, ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదం గా భావించి కృతజ్ఞతలు తెలుపుకుంటే ఎంతో తృప్తిగా దానిని స్వీకరించగలుగుతాము.
సాధారణంగా ఎవరికైనా కడుపునిండా భోజనం పెడితే ఆ వ్యక్తి చాల సంతోషంతో “ఆకలిగా ఉన్ననాకు సాక్షాత్తు అన్నపూర్ణమ్మ లాగా అన్నం పెట్టావు తల్లీ” అని అనటం వింటూ ఉంటాము. ఆ మాట అక్షరాలా నిజం కూడా. భోజనం పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణమ్మలే! ఇంటికి వచ్చిన అతిధులకు కానీయండి, ఇంటిలోని వారికే కానీయండి, ఎవరికైనా అన్నం వడ్డన చేసేటపుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళ లోని ఆప్యాయతే అన్నపూర్ణమ్మ తత్వాన్ని తెలియచేస్తుంది. భోజనం చేసిన వారి కళ్ళలోని తృప్తిని చూసి మురిసే సంతోషమే అన్నపూర్ణమ్మ. అందుకే అన్నపూర్ణ తత్వాన్ని ఏ గొప్ప చిత్రకారుడు కాని, ఏ గొప్ప శిల్పి కాని చూపించటం అన్నది సాధ్యం కాదు అని చెప్పటమే సబబు అనిపిస్తుంది.
జీవకోటికి ప్రాణాధారం అయిన అన్నం ఈమె అధీనం! పరమేశ్వరునికే బిక్ష వేసి ఆది బిక్షువుని చేసింది కనుక, మనమందరం మూడవరోజైన తదియ నాడు వామ హస్తమున అక్షయమైన అన్న పాత్ర, దక్షిణ హస్తమున ఒక గరిట తో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను మనో నేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణా అష్టోత్తరనామాలతో అమ్మవారిని పూజించుకుని, పునీతులమవుదాము. ఈ మూడవ రోజునే తల్లులందరూ 'స్తనవృద్ధి గౌరీ వ్రతం' అని కూడా జరుపుకుంటారు. తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతం ఆచరిస్తూ, జగన్మాతను అన్నపూర్ణా దేవిగా కొలుస్తారు.
మనమందరమూ కూడా దేవీ నవరాత్రులలో రేపటి రోజున శ్రీ శాంకరిని అన్నపూర్ణాదేవి అలంకారంలో ఆరాధించి, ఆమెను ప్రసన్నం చేసుకుని, తరిద్దాము. అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ, అన్నపూర్ణ స్తోత్రం పారాయణం చేసుకుంటూ, సమస్త ఉపచారాలు సలిపి, దద్దోజనాన్ని, కట్టె పొంగలిని నివేదిద్దాము.
ధరించవలసిన వర్ణం: గచ్చకాయ రంగు
నివేదనలు: దద్దోజనం మరియు కట్టెపొంగలి
దద్దోజనం:
ముందుగా ఒక గ్లాస్ బియ్యం మెత్తగా ఉడకబెట్టుకుని, అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. రెండు పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసుకుని సన్నగా తరిగిపెట్టుకోవాలి. పోపుగరిట స్టవ్ మీద పెట్టి ఒక చెంచాడు నెయ్యి వెయ్యండి. వేడెక్కాక రెండు ఎండుమిరపకాయ ముక్కలు, ఒక అరచెంచాడు మినప్పప్పు, సరిపడా జీడిపప్పు పలుకులు, కాసిని మెంతిగింజలు, ఒక పావు చెంచాడు ఆవాలు, ఒక అరచెంచాడు జీలకర్ర్ర వేసి పోపు వేయించుకోవాలి. పోపు వేగాక తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు రెండు రోబ్బలు వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న పోపు చల్లార్చుకున్న అన్నం లో వేసి, తగినంత ఉప్పు జోడించి, కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నానికి సరిపడా పెరుగు వేసి కలిసేలా కలుపుకోవాలి. దద్ద్యన్నాసక్త హృదయ కి దద్దోజనం తయార్.
కట్టెపొంగలి:
రెండు గ్లాసుల బియ్యం, ఒక గ్లాస్ పెసరపప్పు కలిపి, కొంచెం మెత్తగానే ఉడక బెట్టుకోవాలి. నాలుగు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం సన్న గా తరిగి పెట్ట్టుకోవాలి. ఒక కరివేపాకు రెమ్మ ఆకులు తీసి పెట్టుకోవాలి. ఒక చిన్న మూకుడు స్టవ్ మీద పెట్టి, మూడు చెంచాల నెయ్యి వెయ్యాలి. వేడెక్కాక రెండు ఎండు మిరపకాయ ముక్కలు, రెండు చెంచాల మినప్పప్పు, రెండు చెంచాల జీడిపప్పు, ఒక అరచెంచాడు ఆవాలు,ఒక చెంచాడు జీలకర్రవేసి చివరలో ఒక పావు చెంచాడు మిరియాలు వేసి మూత పెట్టాలి. లేకపోతే మిరియాలు పేలి మొహం మీద పడే ప్రమాదం ఉంది, మిరియాల చిటపట వినిపించేక మూత, తీసి అల్లం పచ్చి మిరపకాయ ముక్క లు కరివేపాకు వేసి, వాటి పచ్చివాసన పోయేదాకా వేయించి స్టవ్ మీద నుండి దింపుకోవాలి. ఇప్పుడ ఈ పోపును తగినంత ఉప్పును తీసుకుని, ఉడక బెట్టి ఉంచుకున్న అన్నం, పెసరపప్పు లో బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు పొంగలి పైన రెండు మూడు స్పూన్స్ నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు కట్టెపొంగలి తయార్!
ఇతర నివేదనలు: మిరియాల గారెలు:
ఈ రోజు మిరియాల గారెలు కూడా నివేదించటం కద్దు. పొట్టు మినప పప్పు నానబెట్టి, సగం పొట్టు తీసివేసి, పప్పును మెత్తగా రుబ్బుకుని, అల్లం పచ్చి మిర్చి ముక్కలు, తగినన్ని మిరియాలు, పిండిలో కలుపుకుని, మూకుడులో తగినంత నూనె పోసి, కాగేక, పిండిని గారెలు గా వేసుకోవాలి. ఎర్రగా వేగాక నూనె ఓడ్చి పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు అమ్మవారి నివేదనకు మిరియాల గారెలు కూడా తయార్!