ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

STORY OF THIRUPPAVAI IN TELUGU


తిరుప్పావై

తిరుప్పావై విష్ణువు ను కీర్తిస్తూ, గోదాదేవి మూలద్రావిడం లో గానం చేసిన ముప్ఫై పాశురాల గీతమాలిక. ఇది పన్నిద్దరాళ్వార్లు రచించిన నాలాయిర దివ్య ప్రబంధము లో ఒక ముఖ్య భాగమై, తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది.

భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్ళికాని పడుచులు, తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీదేవి ని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది, దీనినే కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందినదే తిరుప్పావై వ్రతం, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలు ఇదే వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతిదినం తమ యిళ్ళలో, దేవాలయాల్లో విధిగా ఈ పాశురాలను పఠిస్తారు. కాని ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.

ఒక్కొక్క పాశురం ఒక్కొక్క రోజు గానం చేయబడుతుంది. తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీ వైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్కృప, శాంతిసౌఖ్యాలను కోరుకుంటూ, వీటిని గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికై తిరుప్పావైని గానం చేస్తూ, ముప్ఫై రోజులు కఠిన వ్రతమాచరిస్తుంది.

పన్నిద్దరాళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన ముప్పది పాశురాల ప్రబంధం. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాశురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. గోదాదేవి విష్ణుచిత్తుడనే ఆళ్వారుకి తన పూల తోటలో ఒక తులసి చెట్టు వద్ద దొరికింది. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొలదీ శ్రీరంగనాథుడి పట్ల భక్తి పెరుగుతూ, ఆయనను వివాహం చేసుకొంటానని పట్టు పట్టింది.విష్ణుచిత్తుడు భక్తుడైనప్పటికీ ఇలా వివాహం జరగడం అసంభవమని భావించాడు. కానీ, గోదాదేవి భక్తి ఫలించి, రంగనాథుడు స్వప్నంలో గోదా దేవిని వధువుగా అలంకరించి ఆలయానికి రప్పించవలసిందని పెద్దలను ఆజ్ఞాపించాడు. సాలంకృత కన్యగా ఆమె గర్భగుడిలోకి ప్రవేశించి, స్వామిని అర్చించి రాజుతో సహా అందరూ చూస్తుండగా స్వామిలో లీనమైపోయిందని ఐతిహ్యం.

ఇది ఎనిమిది, తొమ్మిది శతాబ్దుల మధ్య జరిగిన ఉదంతంగా పలువురు పరిశోధకుల అంచనా. మార్గశిర మాసంలో గోదాదేవి తన ఈడు ఆడపిల్లలతో కోవెలకు వచ్చి నెలరోజుల పాటు గానం చేసిన ముప్పది గీతాలే (పాశురాలే) ఈ తిరుప్పావై. తిరు అనేది మంగళ వాచకం. శ్రీకరం, శుభప్రదం, పవిత్రం మొదలైన అర్థాలు ఉన్నాయి. పావై అంటే వ్రతం. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమనీ, ధనుర్మాస వ్రతమనీ అంటారు. (గోదాదేవి చేసింది కాత్యాయనీ వ్రతమని కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలలో ఉంది.) తెలుగులోనూ ఈ పాశురాలకు చాలా అనువాదాలు వచ్చాయి. అనువాదం చేసిన వారిలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, లక్ష్మణ యతీంద్రులు మొదలైన గొప్ప కవులు, తత్త్వవేత్తలు ఉన్నారు. గొప్ప వైష్ణవ సాహిత్యమనేగాక, (తమిళంలో) సాహిత్య విలువల దృష్ట్యా సైతం తిరుప్పావై గొప్ప రచన.