ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

31-05-2016 - IMPORTANCE OF SRI HANUMAN JAYANTHI FESTIVAL IN TELUGU


శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత
మన పండుగల్లో ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు.
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
హనుమజ్జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తికి, బల సంపన్నతకు సంకేతమైన హనుమంతుని విశేషాలు స్మరించుకుందాం. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండీ రాముడి సేవలో గడపడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు.
ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి,"నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు.
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది.
అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. హనుమంతుని భక్తికి ఇలాంటి తార్కాణాలు ఎన్నో!
ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు.
అదేమిటని అడగ్గా, ''రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అన్నాడు.
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు.
అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.
ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.
- శ్రీ హనుమాన్ జయంతి (తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో చైత్ర శుద్ధ పౌర్ణిమ రోజున, కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి రోజున జరుపుకుంటారు.)
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు,
హనుమంతుడు.
హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. ఎక్కడ రామనామం చెప్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామజపం జరుగుతుందో అక్కడ ఆనందభాష్పాలు కారుస్తూ, నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయస్వామి కూర్చుని ఉంటారు. చినిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి, రామకధ చెప్పే సభలో ఒక మూలున కూర్చుంటారు. అందరు రాకముందే వచ్చి, అందరు వెళ్ళిపోయేవరకు ఉంటారు.
భూతప్రేతపిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెప్తేనే భయపడి పారిపోతాయి. మహా రోగాలు నయమవుతాయి. చేసేపని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. శని బాధలు తొలగిపోతాయి. బుద్ధి కలుగుతుంది, బలం పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది, దైర్యం వస్తుంది. హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 23 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.