ఈ బ్లాగ్ లో పోస్ట చేయబడిన అన్నీ రకాల వంటలు, టిప్స్ సలహాలు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కొసమే వాటిని ఉపయోగించే ముందు వాటికి సంబందించిన వారి మరియు డాక్టర్ సలహా తీసుకొని ఉపయోగించ మనవి.

Search This Blog

TWW FOLLOWERS

FUNNY ARTICLE ON TOWN LIVING

A satirical conversation as KITIKI 

టౌన్‌ పక్కకెళ్ళొద్దురా.. డింగరీ!!


''రేరు సుబ్బిగా..! టౌన్‌ హాల్లో ఇయ్యాల జరిగే కలర్‌ఫుల్‌ కార్యక్రమాలేటో?'' సుబ్బారావుని ఆరా తీశాడు టిప్‌టాప్‌గా తయారై వచ్చిన శ్రీమాన్‌ అప్పారావు. 

''ఏందిరోరు అప్పిగా..! ఇయ్యాల గాలంతా టౌన్‌హాల్‌ మీదకి మళ్లిందేటీ? పైగా కలర్‌ఫుల్‌ గిలర్‌ఫుల్‌ అని ఏదో కొత్త బాస కూడా మాటాడేత్తన్నవ్‌.. ఏటీ కథ?'' అడిగాడు సుబ్బారావు. అలియాస్‌ సుబ్బి. 
''మరి కలర్‌ఫుల్‌ అంటే కలర్‌ఫుల్లే.. ఎందుకంటే ఆడ రంగు రంగులు బట్టలేసుకుని.. డాన్సులు ఏత్తుంటారు కదా..! మరి కలర్‌ఫుల్‌ అనక ఏటంటాం?'' అంటూ తన పదప్రయోగంలోని జాణతనాన్ని ఎంతో తెలివిగా ప్రదర్శించాడు అప్పి.

''రేరు..! నువ్వంటన్నదేటో తలకెక్కకుంది. డాన్సంటావ్‌.. కలర్‌ఫుల్‌ చొక్కాలంటావ్‌.. ఇషయం ఏంటో అర్థంకాకుందరా అప్పిగే'' బేలగా మొహంపెట్టి అన్నాడు సుబ్బీ.

''అదేరా.. మన కృష్ణాజిల్లాలో ఉందకదా ఓ ఊరు.. అదే.. ఆ కూచిపూడి.. ఆ కూచిపూడి డాన్సులన్న మాట.. హిహ్హిహ్హీ'' అంటూ చిన్న హింట్‌ ఇచ్చాడు అప్పి.

''వార్నీ.. మన తెలుగోళ్ళ కూచిపూడి డాన్సా..! ఆ మాట సెప్పడానికి ఊరికే ఇందాకడ్నుంచి ఒకటే నీలుగుతావేందుకురా..? లక్షణంగా కూచిపూడి డాన్స్‌ అంటే సరిపోదా ఏంది? సరేగానీ ఇంతకీ ఆ పద్ధతైన డాన్సులతో నీకు పనేందిరా?'' అనుమానంగా అడిగాడు సుబ్బారావు.

''భలేవాడివేరోరు.. కళాపోసనకు పెత్యేకించి ఓ పనే ఉండాలా సెప్పు..? కళ ఏడుంటే ఆడకు వెళ్ళాల్సిందే.. తనివితీరా ఈక్షించాల్సిందే..!'' గంభీర వదనంతో చెప్పసాగాడు అప్పి. 
''ఈక్షించాలా.. లేక ఆడకెళ్ళి ఆళ్ళను శపించాలా?'' ఆక్షేపణగా అన్నాడు సుబ్బారావు.
''రేరు సుబ్బిగా.. నీతో ఏదైనా ఇషయం సెప్తే.. పెతిదీ ఎటకారంగానే తీసుకుంటావురా..! అందుకే నీకేటి సెప్పబుద్ధికాదు'' కాస్తంత ఫీలవుతూ అన్నాడు అప్పి.

''అబ్బో.. నువ్విట్టా ఫీలవ్వమాకరా..! కడుపు తరుక్కుపోతా ఉంది. అయినా.. నీ మొఖం ట్రాజెడీకి సూటవ్వదుగానీ.. ఇంకోమాట సెప్పు'' అంటూ ఫీలవుతున్నవాడ్ని మరింత ఫీలయ్యేలా చేశాడు సుబ్బారావు. 

''ఇదిగో సుబ్బిగా.. ఇక మూత్తావా..! నేనేదో అట్టా టౌన్‌హాల్‌కాడికెళ్లి.. కాసేపు కళాపోసన సేసొద్దాం అనుకుంటుంటే.. ఆ పెశ్న ఈ పెశ్న ఏసి, నా కాళ్ళకు అడ్డుపడతావేంది..? నువ్విట్టా మాటాడితే.. నేనొక్కడ్నే కళాపోసన చేసొత్తా..!'' కాస్తంత కోపంగానే అన్నాడు అప్పి.

''ఓరి నీ కళాపోసన తగలెయ్యా..! ఇంతకీ ఆడకెళ్ళి ఏం సేత్తావు నువ్వు?'' ఆసక్తితోనే అడిగాడు సుబ్బారావు.

''రేరు పబ్లిక్‌లో పాపులారిటీ పెరగాలంటే అప్పుడప్పుడు రాజకీయంతోపాటు కూసింత కళాపోసన కూడా ఉండాలా..?'' భుజంపై ఉన్న జరీరుమాలు సర్దుకుంటూ బేస్‌వాయిస్‌తో అన్నాడు శ్రీమాన్‌ అప్పి. 

''రేరు.. నీకూ నాకూ ఎందుకురా ఈ పాపులారిటీ గోల..? సుబ్రంగా ఏళకి కూసింత గంజి తాగి, సల్లగా తొంగోక..?!'' అని సుబ్బి అనగానే..

''రేరు..! నీకూ.. నాకూ అని.. ఊరికే కలిపేసుకోమాకా.. అయినా.. పాపులారిటీ తెచ్చుకోవాలంటే కూసింత టేస్టుండాల..!'' మళ్లీ పాతపాటే పాడాడు అప్పి.

''సరేరా.. మేము మీ అంత గొప్పోళ్ళం కాదులేగానీ.. ఇంతకీ తమరు టౌన్‌హాల్‌కెళ్ళి ఏం చేద్దామని?'' మళ్లీ అడిగాడు సుబ్బి.

''ఏం చేత్తామంటే ఏం చేత్తాం..?! ఆ.. ఆ.. ఆడకు గొప్ప గొప్ప కళాకారులొత్తారు కదా..! ఆళ్ళతో కాసింత పరిచయాలు పెంచుకుంటాం..!'' మాటల్ని పోగు చేసుకుంటూ చెప్పసాగాడు అప్పి.
''పరిచయాలంటే ఏంటో కూసింత ఇవరంగా సెలవిత్తారా?!'' సుబ్బి అడిగిన ప్రశ్నలో ఒకింత వ్యంగ్యం ధ్వనించింది.

''ఇప్పుడు కళాకారుల భుజంపైన చెయ్యేసి.. నవ్వుతూ ఓ ఫొటో దిగినామనుకో.. అలా పడుంటాది కదా.. హిహ్హీ..!'' తనదైన శైలిలో వివరించాడు అప్పి. 

''ఫొటో దిగడం వల్ల ఉపయోగమేందిరా నీకు?'' కుతూహలంగా అడిగాడు సుబ్బి.
''మనకీ కళాపోసన ఉందన్న సంగతి జనాలకి తెలియాలంటే అప్పుడప్పుడు.. అట్టాంటోళ్ళతో ఫొటోలు, గిటోలు దిగి, పరపతి పెంచుకోవాలి..! లేదంటే కళారంగంలో చులకనైపోమూ..?!'' సాగదీస్తూ అన్నాడు అప్పి.

''దాన్ని కళాపోసన అనర్రా పిచ్చనాయాలా..! తగుదునమ్మా అని, అన్నింట్లోనూ ఏలు పెట్టడమంటారు!'' అప్పారావులోని కళాత్మక మురిపెంపై కళ్ళాపి చల్లాడు సుబ్బారావు.
''నీకెప్పుడూ అంతేరా..! ఈ అప్పిగాడు ఎదిగిపోతన్నాడంటే ఒకటే కుళ్ళు'' గుడ్లురుముతూ నొచ్చుకున్నాడు అప్పి.

''ఒరేరు.. నీకోటి సెప్పనా..?'' అని సుబ్బి అనగానే ''ఇనక సత్తామా?! సెప్పు.. సెప్పు'' అంటూ గుర్రుమన్నాడు.

''ఇప్పుడూ.. కొన్ని ఇషయాలు కొంతమందికే సూటవుతారు! నీకూ నాకూ అలాంటి కళలు.. కాకరకాయలు నప్పుతాయా సెప్పు..? అయినా అట్టాంటోళ్ళతో ఫొటోలు దిగితే మాత్రం జనాలకి తెలీదా ఎవళెలాంటోళ్ళో..?'' నచ్చచెప్పబోయాడు సుబ్బారావు.
''రేరు సుబ్బిగా! ఇందాకడ్నుంచి సూత్తన్నా.. కాళ్ళట్టి ఒకటే లాగేత్తున్నావ్‌.. నా కళాపోసన నా ఇట్టం. నువ్వేం నాకు బోడి సలహాలివ్వబోక..'' గట్టిగానే విసుక్కున్నాడు అప్పి.
''అబ్బో.. అయ్యగారికి బాగా కోపం వత్తన్నట్టుందే..! అవునులే మరి రాదేటీ.. ఉన్నమాటంటే ఎవళకైనా గుబులేకదా..!!'' అప్పిని మరింత ఉడికించబోయాడు సుబ్బారావు.
''రేరు పరపతి పెంచుకోవడం తప్పులేదుగానీ, రాని ఇద్యలో ఏలెట్టమాక..! నువ్వేమో మొరటునాయలివి. ఆళ్ళేమో ఎన్నో ఏళ్ళు కళను ఔపోసన పట్టినోళ్ళు.. ఆళ్ళతో నువ్వు ఫొటోలు దిగినంత మాత్రానా కాకి నెమలైపోద్దా? సెప్పు'' నవ్వుతూ అన్నాడు సుబ్బి.
''ఇంతకీ కాకెవరు.. నెమలెవరు? నీ ఎటకారం మరీ ఎక్కువైందిరోరు సుబ్బీ..! ఇట్టా అయితే నీకూ నాకూ కుదురదు..'' అలిగినట్టు మాట్లాడాడు అప్పి.

''నేనూ అదే అంటన్నా.. ఇట్టా అయితే నాకూ కుదరదు మరి. మనకు చేతకాకపోయినా.. ఏదో పామేసుకుందామని అన్నింట్లోనూ ఏలెట్టామనుకో.. జనాల్లో బేడయిపోతాం.. ఏదో మనకొచ్చిన పని మనం సేసుకోవాలా! మనకిచ్చిన బాధ్యతల్ని మనం సరిగ్గా సెయ్యాలా..!! అంతేగానీ.. '' అంటూ సుబ్బి ఇంకేదో చెప్పబోతుంటే.. పక్క వీధులోంచి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ''టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ.. డాంభికాలు పోవొద్దురా!'' అంటూ పాట వినపడుతోంది.
చెవులకు ఇంపుగా తోచని సుబ్బి మాటల్ని, మైక్‌సెట్‌లో ఆ పాటను వినడం ఇష్టంలేక అక్కడ్నుంచి ''డింగ్‌'' అని మాయమైపోయాడు అప్పారావు.. అలియాస్‌ అప్పి.

- గంగాధర్‌ వీర్ల